Thursday, September 18, 2014

దైవిక, దైహిక, భౌతిక దుఃఖములు - కారణములు

ఆకస్మిక సుఖదుఃఖముల నుండి ఎవరూ కూడా (దేవదానవులు, మనుష్యులు, మునులు...) తప్పించుకోలేరు. దీనికి కారణము కర్మమార్గమే. అన్నిరకములైన సుఖదుఃఖములు స్వయముగా పిలవడం వలననే వచ్చును. చేప తనతోకతో తన వెనుకనే గీతలు గీస్తూ ఈదుతుంటుంది. పాము తన శరీరముతో గీతలు గీస్తూ పాకుతుంటుంది. అలాగే మనము ఏ పని చేస్తున్నామో ఆ సంస్కారములు తయారవుతూ ఉంటాయి. చెడుపనుల యొక్క సంస్కారములు స్వయముగా నాటిన ముళ్ళపొదలవలే దుఃఖములకు కారణము అవుతాయి. దుఃఖములు మూడు రకములు దైవిక, దైహిక, భౌతిక.
దైవిక : మనస్సుకు సంబంధించిన దుఃఖములు. మానసిక పాపముల యెక్క పరిణామముల వలన దైవిక దుఃఖములు వచ్చును. ఉదాహరణకు కోపము, అవమానము, చింత, శత్రుత్వము, భయము, శోకము మొదలైనవి. పొగ కారణముగా ఏవిధముగా గోడ నల్లగా తయారవుతుందో, నూనె వలన బట్ట ఎలా జిడ్డు తర్వాత మురికి అవుతుందో అదేవిధముగా చెడు తలంపుల కారణముగా అంతః చైతన్యముపై అదేవిధమైన ప్రభావము పడుతుంది.
శరీరము ద్వారా చేయబడిన హింస, వ్యభిచారము, దొంగతనము మొదలైన వాటిలో మనస్సే ప్రధానము. కానీ ఇటువంటి పనులు జరుగునప్పుడు ఇంద్రియములకు సుఖము ఉండదు. ఇటువంటి పనులు చేయుటకు ఎటువంటి స్వార్ధము ఉండదు కానీ మనస్సులోని ఆవేశము ఆ పని చేయిస్తుంది. దీనివలన మానసిక దుఃఖములు కలుగుతాయి. అంటే ప్రియమైనవారి మృత్యువు, ధననష్టము, అవమానము, దరిద్రము మొదలైనవి. ఇలా ఈ మానసిక వేదనలు ఎక్కువైనప్పుడు వైరాగ్యభావనలు ఉత్పన్నమవుతాయి. ఫలితముగా భవిష్యత్తులో అధర్మ కార్యక్రమముల జోలికి వెళ్ళకుండా ఉంటారు. ఆత్మపై పేరుకొని ఉన్న ప్రారబ్ధకర్మలను (పాపపు సంస్కారములు) తొలగించుటకు దుఃఖములు వస్తాయి. బాధ మరియు వేదనలు పూర్వం చేసిన పనుల (ప్రారబ్ధ కర్మల) యొక్క నికృష్ట సంస్కారములను కడుగుటకు సహాయపడతాయి.  
దైహిక : శరీరమునకు కలిగే దుఃఖములు. శారీరిక పాపముల ఫలితముల వలన దైహిక దుఃఖములు వచ్చును. ఉదాహరణకు రోగములు, దెబ్బలు, శారీరిక లేక మానసిక గాయములు, విషము మొదలైన వాటి వలన కలుగు కష్టములు.
శారీరిక కష్టములు అంటే పుట్టినప్పుడే ఉండే అంగవైకల్యము, వంశపారపర్యముగా వచ్చే రోగములకు కారణము పూర్వజన్మలో ఆ అంగముల యొక్క దురుపయోగము చేయుటయే. చనిపోయిన తర్వాత ఉండే సూక్ష్మ శరీరము మళ్ళీ కొత్త శరీర నిర్మాణము జరిగినప్పుడు ఆజన్మలో ఏ శరీర భాగము దురుపయోగము చేయబడిందో  ఆ భాగము ఈజన్మలో సూక్ష్మ శరీరములో బలహీనమగును. దానివలన శరీరము యొక్క ఆభాగము విశ్రాంతి పొంది వచ్చేజన్మ కొరకు మరలా తాజాగా తయారవుతుంది. మానసిక దుఃఖములు కలగటం వలన మనస్సు యొక్క పాపభారము కడగబడుతుంది.
భౌతిక : సమాజమునకు కలుగు దుఃఖములు. సామాజిక పాపముల కారణము వలన భౌతిక దుఃఖములు కలుగును. ఉదాహరణకు భూకంపము, అతివృష్టి, అనావృష్టి, యుద్ధములు, అంటురోగములు మొదలైనవి.   
మానసిక పాపము శారీరిక పాపముతో కలసి ఉంటుంది. భౌతిక కష్టములకు సామాజిక పాపములే కారణము. ఒక మనిషి యొక్క చెడు కర్మలకు మిగిలిన వారు కూడా బాధ్యులు అవుతారు. ఇంటిలో ఒకరు తప్పు చేస్తున్నప్పుడు దండించనిచో ఆ తప్పు కుటుంబ సభ్యులందరిది అవుతుంది. ఒక ఇల్లు తగలబడుతున్నప్పుడు ఆర్పకపోతే ఆ మంట పక్కఇంటికి కూడా వ్యాపిస్తుంది. ఒక ఇంటిలో కలరా వస్తే నివారణకు ప్రయత్నించకపోతే ఆ ప్రదేశములోని వారు అంతా కలరా పీడితులు అవుతారు. ఏదైనా దొంగతనము, అత్యాచారము, దోపిడి, హత్య మొదలైనవి చూసి తన స్వార్ధముకోసం ఆపడానికి ప్రయత్నించకపోతే సమాజము వానిని ద్వేషిస్తుంది ఒకొక్కసారి చట్టప్రకారము కూడా శిక్షార్హులు అవుతారు. ఏదైనా దేశము లేక జాతి తుచ్ఛమైన స్వార్ధములో నిమగ్నమై ఉన్నప్పుడు (యుద్ధము, లంచం, ఓటు, కల్తీ, మోసం మొదలైనవి) ఇతరుల చెడుకర్మలను నిరోధించి సదాచారము (మంచి) పెరుగుటకు ప్రయత్నించకపోతే సామూహిక పాపము (సమాజములో ఏ ఒక్కరు ఆ పనులను ఆపడానికి ప్రయత్నించరు, మనకెందుకు మనకెందుకు అనే ఆలోచనల వలన ) సామూహిక దండన లభిస్తుంది. ఉదాహరణకు భూకంపము, అతివృష్టి, అనావృష్టి, యుద్ధములు, అంటురోగములు మొదలైనవి. అన్యాయము చేయువారికంటే అన్యాయము సహించువారికే అధిక పాపము కలుగుట దీనికి కారణము. ఈ భౌతిక దోషములు సృష్టి దోషములు కాక మన దోషములే. అగ్నిలో కాల్చబడిన బంగారమువలే మనలను స్వచ్ఛముగా చేయుటకు ఈ అవకాశము (కష్టములు) మాటిమాటికి వస్తూ, ప్రపంచమునకు హెచ్చరికలు చేస్తూ, సామాజిక దోషము పెంచబడకుండా ప్రకృతి ఆదేశము ఇస్తుంటుంది.  
… Continued

No comments:

Post a Comment