Thursday, August 21, 2014

Chitraguptudu - చిత్రగుప్తుడు


నయన్తి నరకం నూనం ఆత్మానో మానవాన్ హతః |

దివం లోకం చతేతుష్టా ఇత్యూచుర్మంత్ర వేదినః ||

నిశ్చయముగా చంపబడిన ఆత్మలు మనుష్యులను నరకమునకు తీసుకొనిపోవును మరియు సంతృప్తి పొందిన ఆత్మలు దివ్యలోకములకు తీసుకొని పోవునని, రహస్యమును వివరించువారు చెప్పిరి.

ఇది గరుడపురాణంలో ఒక వివరణ. యమలోకములో చిత్రగుప్తుడు అనే పేరు గల దేవుడు ప్రతి జీవి యొక్క మంచి చెడు కర్మల యొక్క వివరణ వ్రాస్తూ ఉంటాడని దానిలో చెప్పబడింది. ప్రాణి చనిపోయిన తర్వాత వ్రాయబడినదానికి ఆధారముగా శుభకర్మలకు స్వర్గము, దుష్కర్మలకు నరకము లభించును. సాధారణ దృష్టితో చూస్తే ఇది ఒక కల్పనగా అనిపిస్తుంది లేదా పురాణకధగా అనిపిస్తుంది. కారణము ఏమిటంటే  భూమిమీద వేల మిలియన్ల మనుష్యులు ఉన్నారు. అదేవిధముగా 84 లక్షల యోనుల నుండి జన్మించిన జీవజాలములు ఉన్నాయి. అసంఖ్యాకమైన ప్రాణుల ద్వారా ప్రతిక్షణం చెయ్యబడే పనులు పగలు, రాత్రి విశ్రాంతి లేకుండా కల్ప కల్పాంతరముల వరకు వ్రాయుట ఒక దేవతకు కఠినమైనపని. ఈవిధముగా ఆలోచిస్తే చిత్రగుప్తుని పని అసంభవమని తెలుస్తున్నది.

ఆధునిక విజ్ఞానముతో ఆలోచిస్తే దీనిని ఇంకొక రకముగా విశ్లేషించవచ్చు. పూర్వకాలము గ్రాంఫోన్ రికార్డులు ఉండేవి. దీనిమీద పాటలు రేఖారూపములో ముద్రింపబడి ఉండేవి. అదేవిధముగా వివిధములైన ధ్వనులు (మాటలు, వీణ, వైయోలిన్, ఢమరుకం, వేణువు .. మొదలైనవి) ఒకేసారి రికార్డు చేయబడేవి. ప్రస్తుత కాలములో మనం వాడే CD లు ఈ రకముగా తయారయ్యేవే. అదేవిధముగా మనుష్యులు చేసే పనులు, ఆలోచనల యొక్క సూక్ష్మ రేఖలు మనస్సు యొక్క లోపల పొరలలో నిక్షిప్తమౌతాయి. ఇవే కర్మ రేఖలు. గ్రాంఫోన్, CD ప్లే అయినట్టు మనస్సు లోపల నిక్షిప్తమైనవి కర్మ రేఖలు ఉచితమైన సమయము నందు బయటపడును. భారతీయ ఋషులు పురాతనకాలము నుండే ఈ జ్ఞానమును కలిగి ఉన్నారు.   

కొన్ని లక్షల ఉపాయములు చేసినా ఈ కర్మ రేఖలు చెరిగిపోవు. అనగా కర్మఫలము అందించకుండా (అనుభవించకుండా) ఈ కర్మ రేఖలు తొలగిపోవు. అదేవిధముగా ప్రాణుల ద్వారా జరిగే పనులు వారి మానసిక స్థితిని వివరిస్తాయి. సాధారణ భాషలో నుదిటిరాత అని, బ్రహ్మ లిఖితము అని, విధివ్రాత చెరిపివేయలేము అని అంటూ ఉంటారు. డాక్టర్స్ మానవుని తలలో నిండి ఉన్న గ్రే మేటర్ ను సూక్ష్మదర్శిని సహాయముతో పరిశీలించినప్పుడు అక్కడ ఒక్కొక్క పరమాణువులో లెక్కలేనన్ని రేఖలు అనిపించాయి. కానీ అవి ఎలా తయారు అవుతాయి, దానికి గల కారణములు ఏమిటి అన్నది తెలియలేదు. తక్కువ శ్రమ పడేవారిలో, సోమరిపోతులలో ఈ రేఖలు తక్కువగా కనిపించాయి. ఆలోచనాపరులలో, పనిచేసే వారిలో, కర్మణిష్టాపరులలో ఈ రేఖలు ఎక్కువగా కనిపించాయి. దీనిని బట్టీ ఈ రేఖలు శారీరిక, మానసిక కార్యములు సంక్షిప్త మరియు సూక్ష్మ రూపములో లిఖింపబడునని తెలుస్తున్నది. ఈ ముద్రలు (గీతలు) అంతః పొరలలోని సంస్కారముల గురించి చెప్తాయి. ఇవే పౌరాణిక చిత్రగుప్తుని వాస్తవికతను ధృవీకరిస్తున్నాయి.

చిత్రగుప్త అనే మాటకు అర్ధం తెలుసుకుందాము. చిత్రగుప్తను తిప్పి వ్రాస్తే గుప్త చిత్ర (Secret picture) అంటే గుప్తమైన మనస్సు, లేక అంతః చైతన్యము, లేక సూక్ష్మమైన మనస్సు, లేక లోపల ఉన్న బుద్ధి, ఆ బుద్ధిలోపల ఉన్న చిత్రము. బహుశ ఏ చిత్రమైనా గీతల ద్వారానే వేయబడుతుంది కాబట్టి చిత్ర అనే శబ్దము నుండి చిత్రము వచ్చి ఉండవచ్చు. కర్మరేఖలు ఒకవిధముగా గుప్త చిత్రములే. పెద్ద చిన్న సంఘటనల యొక్క ఫలితములు చిత్రములుగా మన మనస్సులో సూక్ష్మముగా గుప్తరూపములో చిత్రింపబడి ఉంటాయి. ఈ గుప్తముగా ఉన్న ఈ చిత్రములనే చిత్రగుప్త అని అంటారు. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు అన్ని పనులు మరియు ఆలోచనలు ఇలా చిత్రములుగా నిక్షిప్తమై ఉంటాయి.

ఈ చిత్రగుప్తుడు నిస్సందేహముగా ప్రతిప్రాణి యొక్క ప్రతిఒక్క పనిని ప్రతిక్షణము విశ్రాంతి లేకుండా తన చిట్టాలో లిఖిస్తూ ఉంటాడు. ఈ చిత్రగుప్త అనేది ప్రతివారికి వేరేవేరేగా ఉంటుంది. ప్రతివారికి ఇలా వారు చేసే, ఆలోచించే అన్ని పనులు ఒకవ్యక్తి వ్రాయడం అనేది జరిగేపనికాదు. స్థూలశరీరములో చేసే పనులు, ఆలోచనలు సూక్ష్మ శరీరములో నిక్షిప్తమై ఉంటాయి. దివ్యశక్తులు వ్యాపకమై ఉంటాయి. ప్రాణశక్తి ఒక్కటే. కానీ దాని అంశములో వ్యష్టి మరియు సమిష్టి బేధాలున్నాయి. రెండు పదార్ధాలు ఒకటిగానే ఉన్నా వాటి స్థానభేధము వలన అనేకమైన పేర్లు పొందుతూ ఉంటాయి. పూలతోటలోని గాలి మురికి కాలువలోని గాలి వాటి స్థానభేధము వలన వేరేవేరే పేర్లను కలిగి ఉంటాయి. కానీ మూలమైన విశ్వవ్యాపకమైన గాలితత్వము ఒక్కటే. ఘటములోని ఆకాశము మఠముపైన ఆకాశము వేరేవేరే అయినా విశ్వవ్యాపకమైన ఆ ఆకాశతత్వము ఒక్కటే. అలాగే వేరేవేరే శరీరములలో ఉండి, వేరేవేరేగా పనులు చేసే చిత్రగుప్తుడు కూడా ఒకే తత్వమును కలిగి ఉంటాడు. ఎలాగైతే షార్ట్ హాండ్ వారు పెద్దపెద్ద పదములను చిన్న చిన్నపదములు, గీతలు, గుర్తులతో వ్రాసుకుంటారో అదేవిధముగా ఈ చిత్రగుప్తుడు వ్రాసిన కర్మరేఖలు మనస్సులో గుప్తముగా ఏదో ఒక పరమాణువుపై అదృశ్యరూపములో మేల్కొని ఉంటాయి.