Friday, September 16, 2016

మహాలయపక్షం


భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో, బహుళపక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని, మహాలయ పక్షమని పేరు. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు పితృప్రాణం భూమిపై వ్యాపించి ఉంటుంది. పితరులను ఉద్దేశించి, వారి ఆత్మను తృప్తి పరచటానికి శ్రద్దతో అర్పించేదే శ్రాద్ధం. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష్మ అంశం అటూఇటూ తిరుగుతూ ఉంటుంది. వారివారి కర్మానుసారం ఫలితం లభిస్తుంది. శ్రాద్ధకాలం ప్రారంభం కాగానే పితృదేవతలు తమతమ వారిని స్మరించుకుంటూ మనోమయరూపంలో శ్రాద్ధస్థలం చేరుకుంటారు. వారు బ్రాహ్మణులతో కూడి వాయురూపంలో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర, పౌత్రుల దగ్గరకు వస్తారని చెప్పబడింది. మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి యొక్క గృహ ద్వారం దగ్గరే నిలబడతారు. నిజానికి, ప్రతిమాసంలోను అమావాస్య పితరుల పుణ్యతిథిగా భావించబడినా, మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉన్నది. ఈ రోజు సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంది. తమ పితరుల పుణ్య తిథి వివరాలు తెలియనివారు, పితృపక్షంలో ఆ తిథినాడు ఏ కారణం చేతైనా శ్రాద్ధం పెట్టలేనివారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, దానం, తర్పణం చేస్తారు. అన్ని దానాలలోను అన్నదానం ప్రధానమైనది, అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది, కానీ   మహాలయపక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞాల ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబందించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధకర్మ అక్షయఫలన్నిస్తుంది. 

ఏ రోజు శ్రాద్ధకర్మ చేస్తే ఎటువంటి ఫలితం లబిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా తెలుసుకోవచ్చు. పాడ్యమి నాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల ధన సంపద లభిస్తుంది. ద్వితీయనాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల రాజయోగం, సంపద లభిస్తుంది. తృతీయనాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల శత్రువులు నశిస్తారు. చతుర్దినాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది, అంతే కాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగా పసిగట్టగలరు. పంచమినాడు శ్రాద్ధకర్మ చేయటం వాళ్ళ ఉత్తమ లక్ష్మీప్రాప్తి కలుగుతుంది. పుత్రకామన గలవారికి ఫలం లభిస్తుంది. షష్ఠినాడు శ్రాద్ధకర్మ వల్ల దేవతలు, పితరులు ప్రసన్నులవుతారు. ఆ వ్యక్తికి సమాజంలో శ్రేష్ఠగౌరవం లభిస్తుంది. సప్తమినాడు శ్రాద్ధకర్మ వల్ల యజ్ఞం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది. అష్టమినాడు శ్రాద్ధకర్మ చేస్తే సంపూర్ణ సమృద్ధి, ధనం, బుద్ది ప్రాప్తిస్తాయి. నవమినాడు శ్రాద్ధకర్మ చేస్తే విస్తారంగా సంపద, అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది. దశమినాడు శ్రాద్ధకర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి, పశుసంపద వృద్ది చెందుతుంది. ఏకాదశినాడు శ్రాద్ధకర్మ చేస్తే సర్వశ్రేష్ఠ దానఫలం లభిస్తుంది. అన్ని పాపాలు నశిస్తాయి, వేదజ్ఞానం ప్రాప్తిస్తుంది , కుటుంబం వృద్ది చెందుతుంది. ద్వాదశినాడు శ్రాద్ధకర్మ చేస్తే దేశం అబివృద్ది చెందుతుంది. శ్రాద్ధకర్తకు అన్నానికి లోటుండదు, అలాగే పుత్ర, పశు, మేధా, బుద్ధి, జయ సంపత్తి కలుగుతుంది. త్రయోదశినాడు శ్రాద్ద కర్మ చేస్తే ధనం, సంతతి, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం , బంధుమిత్రులలో గౌరవం లభిస్తాయి. చతుర్దశినాడు శ్రాద్ధకర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది. అమావాస్య నాడు శ్రాద్ధకర్మ చేసే వ్యక్తికి సమస్త లాభాలు కలిగి, అన్ని కోరికలు నెరవేరుతాయి.  

ఆర్థికాభావం వలన విద్యుక్తంగా శ్రాద్ధకర్మలు చేయలేకపొతే , పితృపక్షంలో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలుకాకపొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు, అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాన్న సమయంలో రెండు చేతులు ఆకాశంవైపు ఎత్తి పితృదేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధకర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖసంతోషాలు, పరలోకంలో ఉత్తమగతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.

దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామనుకుంటే ఆ పండు కాస్తా బంగారపు పండుగా మారిపోయింది. చెట్టుకున్న పండ్లే కాదు ఏ చెట్టు పండు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. కనీసం దప్పికయినా తీర్చుకుందామనుకుని దోసిట్లోకి నీటిని తీసుకోగానే ఆ నీరు కాస్తా బంగారపునీరుగా మారిపోయింది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ‘‘కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు కానీ, కనీసం ఒక్కరికి కూడా అన్నంపెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’ అని చెప్పగా,  కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్ళి ప్రాధేయపడగా, ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు భూలోకానికెళ్ళి అక్కడ అన్నార్తులందరికీ అన్నంపెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.

యజ్ఞయాగాదులు, తపోధ్యానాలతో దేవఋణాన్ని, తాతముత్తాలకు పిండప్రదానాలు చేసి పితృ ఋణాన్ని, వేదశాస్త్రాధ్యయన ప్రవచనాలతో ఋషి ఋణాన్ని తీర్చుకోవాలి అని మహాభారతంలో ఆయా సందర్భాలలో బోధించబడింది.