Wednesday, September 24, 2014

పండుగల ద్వారా ప్రారబ్ధకర్మను మార్చుకోవచ్చు

ఒక దేశకాల పరిస్థితులలో పుట్టినటువంటి అందరి ప్రారబ్ధకర్మ ఒకే రకముగా ఉంటుంది. అందరు ఒకటే చదువుతారు, ఒకలాగే ఆలోచిస్తారు, ఒకే రకమైనదే  తింటారు. సామూహికమైన కర్మలను పండుగా మార్చేయటానికి పండుగలు వచ్చాయి. పక్వానికి తీసుకు రావడానికి చేసే దానిని పండుగ అంటారు. ఆ సంవత్సరము నాడు సామూహికముగా ఆ పండుగ చేసుకోవడం వలన ఆ కర్మలు పక్వానికి వస్తాయి. అంటే ప్రారబ్ధకర్మ పోతుంది. అంత అద్భుతమైనటువంటి వరాన్ని ఈనాడు ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు తినడానికి ఉపయోగించుకుంటున్నారు. పిండివంటలు చెయ్యడానికి పాపం ఇంట్లో ఆవిడ చస్తూ ఉంటుంది, అందరు బయట కబుర్లు చెప్పుకుంటూ, TV చూస్తూ, కంప్యూటర్, లాప్ టాప్, ఫోన్లలతో, ఇంటర్ నెట్ తో బిజీగా ఉంటారు. నానా అవస్థపడి చేశాక తినేవాళ్ళు ఎవరు ఉండరు. ఒకరికి gastric ట్రబుల్, ఇంకొకరికి షుగర్, ఇంకొకరికి బిపి, ఇంకొకరికి ఇంకొకటి, ఈలోపల ఇంటికి ఎవరో వస్తారు చివరికి అంతా గందరగోళం అయిపోతుంది.
ఎంతో అద్భుతమైన శాస్త్రాన్ని చిన్నచిన్న పండుగలుగా మార్చి ఋషులు అందిస్తే ఆ పండుగనాడు బంధువులు అందరు కలవాలి అని చెప్తే, ఎందుకు కలవాలి మా ఇంట్లో మేము చేసుకుంటాము అంటారు? ఎందుకు కలవాలి అంటే అందరు అదే ప్రారబ్ధకర్మలో పుట్టారు కనుక. ప్రారబ్ధకర్మను బట్టే కదా బంధాలు బంధువులు ఏర్పడతాయి. మరి పైవాడు కర్మలను తీసేయాలి అంటే ఒకరు అమెరికాలోనూ ఒకరు ఇండియాలోను ఉంటే ఎలా కుదురుతుంది. అంటే అందరు ఒకేచోట ఉండాలి. అందుకని అందరు కలసి మెలసి పండుగలను చేసుకోండీ అని పెద్దవాళ్ళు చెప్పేది.
Cont …..
 

సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు

పరిణామక్రమములో ఏమి చెయ్యాలి అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఆ కాలములో పుట్టిన మహానుభావులు డైరెక్ట్ గా చెప్తారు మీరు ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో. డైరెక్ట్ గా గాయత్రీ మంత్రము చేసుకుంటే సామూహికమైన ప్రారబ్ధ విచ్ఛేదనకు కావలసినటువంటి మార్గము ఏర్పడుతుందని గురువుగారు (పండిత శ్రీరామశర్మ ఆచార్య) చెప్తున్నారు. ఇప్పుడు ప్రారబ్ధకర్మను మార్చుకోవడానికి ఐదు రకాలైన జీవిత చర్యలను చేసుకోవాలి. ప్రపంచములో మానవ శరీరధారి అయినవాడు ఎవరైనా సరే ఈ సంచిత ప్రారబ్ధకర్మను పూర్తి చేసుకోవడానికే పుడతాడు.
ఎక్కడ ఏమి చదువుకోవాలో అక్కడ చదువుకోలేదు అందుకని ఎక్కడ ఎవరిని పెళ్ళిచేసుకోవాలో అక్కడ పెళ్ళి చేసుకోలేదు. అందుకని పిల్లలు ఎవరు పుట్టాలో వాళ్ళు పుట్టరు. చదువు పెళ్ళిళ్ళ విషయములలో ఏ ప్రారబ్దకర్మలతో కిందకు దిగామో, వాటికి (చదువు పెళ్ళి) కావలసిన అనుకూల పరిస్థితులు తెచ్చుకోలేదు కనుక పుట్టవలసిన పిల్లలు కాకుండా ఇంకొక రకమైన పిల్లలు పుడతారు. అంటే ప్రారబ్దకర్మలో ఏ పిల్లలైతే పుట్టాలని వ్రాసి ఉందో ఆ పిల్లలు కాకుండా వేరేవారు పుడతారు. కారణం ఏమిటంటే, అంటే చదువుకోవలసిన వయస్సులో చదువుకోగలిగిన పరిస్థితులు ఉన్నా ఏదో ఒక కారణము చేత చదువుకోలేదు. అందుచేత చేసుకోవలసిన వానితో వివాహంకాకుండా వేరేవారితో జరుగుతుంది. అక్కడ కర్మాధి దేవతలకు తెలుసు కదా ఏది జరగాలో ఏది జరగకూడదో అందుకని ఆ పుట్టవలసిన పిల్లలు  (ముగ్గురో నాలుగురో) పుట్టరు. ఈ అడ్డదిడ్డాన్ని balance చేసుకోవడానికి ప్రకృతిలో family planning వచ్చింది.
Family planning రావడానికి కారణాలు ఏవైనా చెప్పుకోవచ్చు. కానీ దానికి అసలైన కారణం ఇది. Family planning భారతీయ ఆధ్యాత్మికతకు విరుద్ధము. కానీ కర్మాధి దేవతలకు లింక్ ఎక్కడా దొరకడం లేదు అందుకని అసలు వద్దుపొండి అన్నారు. అసలు వద్దుపొండి అంటే ప్రమాదం సూక్ష్మ జగత్తులో జరిగింది ఆ దేశకాల పరిస్థితులలో ఏ తల్లితండ్రులకి ఎవరు ఎక్కడ పుట్టాలో ఆ పరిస్థితులలో పుట్టకపోవడం వల్ల సంచితకర్మ పెరిగిపోతోంది, దానిని పాపభారం పెరిగింది అంటాము. కలియుగములో పాపభారం పెరగడం వల్ల భూదేవి అల్లల్లాడి పోతుంది అంటే అంతరార్ధం ఇది. విశుద్ధమైన విజ్ఞానం పెరిగిపోతోంది.
పిల్లలు పుట్టారు. ఈ పిల్లలు నీ భౌతిక శరీరము, నీ మనోమయ శరీరము, నీ కామమయ శరీరము నీ ప్రారబ్ధకర్మను అనుభవించడానికి అనుకూలముగా ఏ కర్మాధి దేవతలు తీర్చిదిద్దారో దానికి తగినట్టు వచ్చిన పిల్లలు మాత్రము వాళ్ళు కాదు. శరీరము తయారయింది. దానికి కావలసిన చదువు పెళ్ళి కాలేదు. పెళ్ళి అంటే సంబంధాలు. పెళ్ళి అంటే భార్యా భర్తేనా? ఆమెతో పాటు అత్తగారు, మామగారు, ఆడపడచులు, మరుదులు, చుట్టాలు చాలామంది వస్తారు. చాలా బంధాలు (లింక్స్) వస్తాయి. ఈ లింక్స్ అన్నీ కూడా మనం ప్లాన్ చేసుకున్నవి కాదు. పిల్లలు కూడా మనం ప్లాన్ చేసుకున్న వాళ్ళు కాదు. ప్లాన్ చేసుకున్నాము అని భావిస్తుంటాము. అందుచేత పెళ్ళైనప్పటి నుంచి మనోమయ కోశము, కామమయ కోశము అనేక ఒత్తిళ్ళకు గురై సుఖాన్ని కోల్పోతుంది. అందుకని కర్మ సిద్ధాంతాన్ని అర్ధం చేసుకుంటే చాలా స్పష్టముగా అర్ధం అయిపోతుంది ఎక్కడ తప్పు జరుగుతోందో. సవరించుకోవడం తేలిక. అందుకని చేయదలచుకున్న తపస్సులు కర్మ ఆధారముగా నిర్ణయించుకోవాలి. (see ద్వాదశ తపస్సులు)
చేయవలసిన తపస్సును ఎలా నిర్ణయించుకోవాలి? ప్రారబ్ధకర్మ మాత్రమే తెలుసు సంచితకర్మ ఏమి తెలియదు ప్రస్తుతం. ఆగామికర్మ ఎలా ఏర్పడుతుంది? సంచితకర్మ ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మ కలసి చనిపోయేటప్పుడు ఆగామికర్మగా ఏర్పడుతుంది. అందులో మళ్ళీ ప్రారబ్ధకర్మని చేసుకుంటాము. ప్రారబ్ధకర్మ ఏమిటో స్పష్టముగా తెలిస్తే జీవిత విధానము వేరేరకముగా ఉంటుంది. కానీ ప్రారబ్ధకర్మ తెలియడానికి అందరు ఋషులు అవలేరు కనుక వారు జ్యోతిష్యశాస్త్రము అందించారు. జ్యోతిష్యశాస్త్రము అవగాహన ఉన్నవాళ్ళు 80% ప్రారబ్ధకర్మను కరెక్ట్ గా చెప్పేయగలరు. పుస్తకాలను చూసి జ్యోతిష్యము చెప్పేవాళ్ళు కాదు. ఋషులు అయితే 100% చెప్పేయగలరు. అందుచేతనే పూర్వకాలములో ఋషులు ఏది చెప్తే అవి జరిగేవి. నిజంగా జ్యోతిష్యశాస్త్రమును కనుక అధ్యయనం చెయ్యగలిగితే ఈ ప్రారబ్ధకర్మను గురించి చాలా అవగాహన వస్తుంది అప్పుడు ఏ పేరు పెట్టాలో దగ్గర నుంచి ఏమి చదువుకోవాలో, ఎవరిని పెళ్ళి చేసుకోవాలో, పిల్లలు ఎప్పుడు పుట్టాలో, ఆ పిల్లలకు ఎప్పుడెప్పుడు ఏ ఏ సంస్కారాలు చెయ్యాలో మొత్తము కూడా జ్యోతిష్య శాస్త్రము ఆధారముగా జరగవలసిన కర్మలు. విశాలమైన భారతీయ సంస్కృతికి ఆధారమైన జ్యోతిష్యశాస్త్రము ఇప్పుడు దాదాపుగా కాలగర్భములో కలిసిపోయింది. నిజమైన జ్యోతిష్యశాస్త్రము యొక్క అవగాహన చాలామందికి లేదు. ఆ జ్యోతిష్య శాస్త్రమును ఒక సవ్యమైన పద్ధతిలో పెట్టడానికి పండుగలు ఏర్పడ్డాయి. (See పండుగలు)

Thursday, September 18, 2014

దైవిక, దైహిక, భౌతిక దుఃఖములు - కారణములు

ఆకస్మిక సుఖదుఃఖముల నుండి ఎవరూ కూడా (దేవదానవులు, మనుష్యులు, మునులు...) తప్పించుకోలేరు. దీనికి కారణము కర్మమార్గమే. అన్నిరకములైన సుఖదుఃఖములు స్వయముగా పిలవడం వలననే వచ్చును. చేప తనతోకతో తన వెనుకనే గీతలు గీస్తూ ఈదుతుంటుంది. పాము తన శరీరముతో గీతలు గీస్తూ పాకుతుంటుంది. అలాగే మనము ఏ పని చేస్తున్నామో ఆ సంస్కారములు తయారవుతూ ఉంటాయి. చెడుపనుల యొక్క సంస్కారములు స్వయముగా నాటిన ముళ్ళపొదలవలే దుఃఖములకు కారణము అవుతాయి. దుఃఖములు మూడు రకములు దైవిక, దైహిక, భౌతిక.
దైవిక : మనస్సుకు సంబంధించిన దుఃఖములు. మానసిక పాపముల యెక్క పరిణామముల వలన దైవిక దుఃఖములు వచ్చును. ఉదాహరణకు కోపము, అవమానము, చింత, శత్రుత్వము, భయము, శోకము మొదలైనవి. పొగ కారణముగా ఏవిధముగా గోడ నల్లగా తయారవుతుందో, నూనె వలన బట్ట ఎలా జిడ్డు తర్వాత మురికి అవుతుందో అదేవిధముగా చెడు తలంపుల కారణముగా అంతః చైతన్యముపై అదేవిధమైన ప్రభావము పడుతుంది.
శరీరము ద్వారా చేయబడిన హింస, వ్యభిచారము, దొంగతనము మొదలైన వాటిలో మనస్సే ప్రధానము. కానీ ఇటువంటి పనులు జరుగునప్పుడు ఇంద్రియములకు సుఖము ఉండదు. ఇటువంటి పనులు చేయుటకు ఎటువంటి స్వార్ధము ఉండదు కానీ మనస్సులోని ఆవేశము ఆ పని చేయిస్తుంది. దీనివలన మానసిక దుఃఖములు కలుగుతాయి. అంటే ప్రియమైనవారి మృత్యువు, ధననష్టము, అవమానము, దరిద్రము మొదలైనవి. ఇలా ఈ మానసిక వేదనలు ఎక్కువైనప్పుడు వైరాగ్యభావనలు ఉత్పన్నమవుతాయి. ఫలితముగా భవిష్యత్తులో అధర్మ కార్యక్రమముల జోలికి వెళ్ళకుండా ఉంటారు. ఆత్మపై పేరుకొని ఉన్న ప్రారబ్ధకర్మలను (పాపపు సంస్కారములు) తొలగించుటకు దుఃఖములు వస్తాయి. బాధ మరియు వేదనలు పూర్వం చేసిన పనుల (ప్రారబ్ధ కర్మల) యొక్క నికృష్ట సంస్కారములను కడుగుటకు సహాయపడతాయి.  
దైహిక : శరీరమునకు కలిగే దుఃఖములు. శారీరిక పాపముల ఫలితముల వలన దైహిక దుఃఖములు వచ్చును. ఉదాహరణకు రోగములు, దెబ్బలు, శారీరిక లేక మానసిక గాయములు, విషము మొదలైన వాటి వలన కలుగు కష్టములు.
శారీరిక కష్టములు అంటే పుట్టినప్పుడే ఉండే అంగవైకల్యము, వంశపారపర్యముగా వచ్చే రోగములకు కారణము పూర్వజన్మలో ఆ అంగముల యొక్క దురుపయోగము చేయుటయే. చనిపోయిన తర్వాత ఉండే సూక్ష్మ శరీరము మళ్ళీ కొత్త శరీర నిర్మాణము జరిగినప్పుడు ఆజన్మలో ఏ శరీర భాగము దురుపయోగము చేయబడిందో  ఆ భాగము ఈజన్మలో సూక్ష్మ శరీరములో బలహీనమగును. దానివలన శరీరము యొక్క ఆభాగము విశ్రాంతి పొంది వచ్చేజన్మ కొరకు మరలా తాజాగా తయారవుతుంది. మానసిక దుఃఖములు కలగటం వలన మనస్సు యొక్క పాపభారము కడగబడుతుంది.
భౌతిక : సమాజమునకు కలుగు దుఃఖములు. సామాజిక పాపముల కారణము వలన భౌతిక దుఃఖములు కలుగును. ఉదాహరణకు భూకంపము, అతివృష్టి, అనావృష్టి, యుద్ధములు, అంటురోగములు మొదలైనవి.   
మానసిక పాపము శారీరిక పాపముతో కలసి ఉంటుంది. భౌతిక కష్టములకు సామాజిక పాపములే కారణము. ఒక మనిషి యొక్క చెడు కర్మలకు మిగిలిన వారు కూడా బాధ్యులు అవుతారు. ఇంటిలో ఒకరు తప్పు చేస్తున్నప్పుడు దండించనిచో ఆ తప్పు కుటుంబ సభ్యులందరిది అవుతుంది. ఒక ఇల్లు తగలబడుతున్నప్పుడు ఆర్పకపోతే ఆ మంట పక్కఇంటికి కూడా వ్యాపిస్తుంది. ఒక ఇంటిలో కలరా వస్తే నివారణకు ప్రయత్నించకపోతే ఆ ప్రదేశములోని వారు అంతా కలరా పీడితులు అవుతారు. ఏదైనా దొంగతనము, అత్యాచారము, దోపిడి, హత్య మొదలైనవి చూసి తన స్వార్ధముకోసం ఆపడానికి ప్రయత్నించకపోతే సమాజము వానిని ద్వేషిస్తుంది ఒకొక్కసారి చట్టప్రకారము కూడా శిక్షార్హులు అవుతారు. ఏదైనా దేశము లేక జాతి తుచ్ఛమైన స్వార్ధములో నిమగ్నమై ఉన్నప్పుడు (యుద్ధము, లంచం, ఓటు, కల్తీ, మోసం మొదలైనవి) ఇతరుల చెడుకర్మలను నిరోధించి సదాచారము (మంచి) పెరుగుటకు ప్రయత్నించకపోతే సామూహిక పాపము (సమాజములో ఏ ఒక్కరు ఆ పనులను ఆపడానికి ప్రయత్నించరు, మనకెందుకు మనకెందుకు అనే ఆలోచనల వలన ) సామూహిక దండన లభిస్తుంది. ఉదాహరణకు భూకంపము, అతివృష్టి, అనావృష్టి, యుద్ధములు, అంటురోగములు మొదలైనవి. అన్యాయము చేయువారికంటే అన్యాయము సహించువారికే అధిక పాపము కలుగుట దీనికి కారణము. ఈ భౌతిక దోషములు సృష్టి దోషములు కాక మన దోషములే. అగ్నిలో కాల్చబడిన బంగారమువలే మనలను స్వచ్ఛముగా చేయుటకు ఈ అవకాశము (కష్టములు) మాటిమాటికి వస్తూ, ప్రపంచమునకు హెచ్చరికలు చేస్తూ, సామాజిక దోషము పెంచబడకుండా ప్రకృతి ఆదేశము ఇస్తుంటుంది.  
… Continued

Wednesday, September 17, 2014

ప్రారబ్ధము ఆకస్మిక సుఖదుఃఖములకు కారణము

చాలాసార్లు ప్రకృతి నియమమునకు పూర్తి వ్యతిరేకముగా అనిపించు విషయములు సంభవిస్తూ ఉంటాయి. ఒక మనిషి ఎంతో ఉత్తమ జీవితమును గడుపుతున్నప్పటికీ ఏదో తప్పుకు దండన విధించినట్లు ఆపదలు వస్తుంటాయి. వేరొకరు ఎంత చెడు పనులు చేస్తున్నప్పటికీ అతనికి అన్ని రకములైన సుఖసౌభాగ్యములు లభిస్తూ ఉంటాయి. కష్టపడి పనిచేయనివారికి లాటరీలో, జూదములో, లేక ఎక్కడో దొరకడం, లేక ఎవరో ఇవ్వడం మూలంగానో ధనము లభిస్తూ ఉంటుంది. కానీ నిరంతరం శ్రమ చేస్తున్న వ్యక్తి మాత్రం లేమిలో ఉంటూ ఉంటాడు. ఒకరు కొంచం శ్రమ చేయగానే విజయాన్ని సాధిస్తారు. ఇంకొకరు కఠిన ప్రయత్నం చేసినప్పటికీ అపజయాన్నే పొందుతూ ఉంటారు. దీనికి కారణము ప్రారబ్ధము. ఒక్కక్కసారి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితము రాదు. దానికితోడు వ్యతిరేక ఫలితాలు వస్తుంటాయి. వాటిని ఎంతోకొంత అనుభవించక తప్పదు. ఇటువంటి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఇంటికి వచ్చిన వారినో, కొత్తగా జన్మించిన పిల్లలనో, కొత్త కోడలినో ఆల్లుడునో, కొత్తగా కొన్న పశువులనో, ఇంటినో, వస్తువులనో ఈ సంఘటనలకు కారణముగా చూపిస్తూ ఉంటారు.
ఉదాహరణకు ఇంటిలోకి కొత్త కోడలు వచ్చిన కొన్ని రోజులలోనే ఆ ఇంటిలోఎవరైనా మరణిస్తే అలాంటప్పుడు మృత్యు దోషమునకు కారణము కొత్తకోడలు అని, దురదృష్టవంతురాలు వస్తూనే ఒకరిని బలి ఇవ్వవలసి వచ్చింది అని అంటారు. కానీ వాస్తవముగా ఆకస్మిక దుర్ఘటనలు జరిగినప్పుడు మనస్సు తీవ్ర బాధకు గురియై కర్తవ్యములను వదిలేసి మాటలను వాడటం జరుగుతూ ఉంటుంది. అకస్మాత్తుగా వచ్చు మూడు రకములైన సుఖదుఖములు (దైవిక, దైహిక, భౌతిక సంఘటనలు) సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలపై ఆధారపడి ఉంటాయి.   

Thursday, September 4, 2014

పాపపుణ్యములు

సాధారణముగా బాహ్యప్రపంచములో పాపపుణ్యముల కొలత డబ్బును అనుసరించి ఉంటుంది. వీడు చాలా దానం చేశాడు వీడు పుణ్యాత్ముడు వాడు అసలు దానం చెయ్యలేదు వానికి పాపం అంటుతుంది అని అంటూ ఉంటారు. రూపాయి దానము చేసిన వానిని ఈ రోజులలో ఎవరు కన్నెత్తి చూడరు. ఎక్కువ ధనము, ధాన్యము మొదలైనవి దానము చేసినవానికే ఎక్కువ పేరు ప్రతిష్టలు లభిస్తూ ఉంటాయి.
 
చిత్రగుప్తుని సామ్రాజ్యములో రూపాయిల కొలమానము ఉండదు. అక్కడ కోరిక, భావన అనేవి మాత్రమే కొలమానములు. మనస్సు లోపల లోభముతో చేసిన దానముల వలన ఎక్కువ దానము చేసినవారు బిక్షగాళ్ళవలె, తక్కువ దానము చేసినవారు చక్రవర్తివలే అక్కడ లెక్కింపబడతారు. మనిషి ఏ పని అయినా ఏ కోరికను అనుసరించి చేస్తున్నాడో ఆ కోరిక మంచి చెడు పనులను అనుసరించి ఉంటుంది. కోరిక ఎంత తీవ్రముగా ఉంటుందో పాపపుణ్యములు కూడా అంతే బలంగా ఉంటాయి.
ఉదాహరణకు ఉరిశిక్షను అమలుపరచు తలారి కూడా ఈ కోవకే చెందుతాడు. అతనికి మనస్సులో ఆపనిపట్ల విముఖత ఉన్నా ఉద్యోగ బాధ్యత రీత్యా ఆపని చేస్తాడు. అందుచేత అతనికి ఆ పనిపట్ల విముఖత చిత్రగుప్తుని రహస్యఖాతాలో ముద్రింపబడి ఉంటుంది.           
ఇంకొక ఉదాహరణ ఒక వ్యక్తి ఉదాసీన మనస్సుతో రోగికి సేవ చేస్తాడు. ఇంకొక వ్యక్తి మరొక రోగికి దయ, సానుభూతి, ఉదారము, ప్రేమతో సేవ చేస్తాడు. బాహ్యముగా చూస్తే ఇద్దరి పనులు ఒకేలాగా కనిపిస్తూ ఉంటాయి. కానీ పుణ్యము యొక్క ఫలితములలో తేడా ఉంటుంది.
ఇదేవిధముగా ఆకలిగా ఉన్న దొంగ ఆహారమును దొంగతనం చేస్తాడు. వేరొక వ్యక్తి చెడు అలవాట్లకోసం దొంగతనం చేస్తాడు. దొంగతనము ఇద్దరు చేసినప్పటికి స్వభావములలో తేడా కారణముగా పాపము కూడా అదే నిష్పత్తిలో వస్తుంది.
 
పసిపిల్లవాడు బట్టల మీద మలమూత్ర విసర్జన చేసినా ఎవరు చెడ్డపని అని చెప్పరు అంతేకాక పిల్లవాడు కొంచెము కూడా సిగ్గుపడడు. ఆదేపెద్దవారు చేసినట్లైతే వారు సిగ్గుపడతారు. చేసిన పని ఒకటే అయినా వారి మానసిక పరిస్థితిని అనుసరించి ఎక్కువ తక్కువలు ఉంటాయి.
ఒకవేటగాడు పొట్టకూటి కోసం వేటాడి తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ఒక పండితుడు దొంగతనముగా మాంసపుదుకాణానికి వెళ్ళినట్లైతే వేటగానికంటే ఎక్కువ పాపము కూడబెట్టుకుంటాడు. ఎందుకంటే జ్ఞాని ఏవిధముగా పురోగమిస్తూ ఉంటాడో అతని అంతఃచైతన్యము కూడా అంతే స్వచ్చముగా తయారవుతుంది. మురికి బట్టమీద ధూళి పడితే ఎటువంటి తేడా కనిపించదు. కానీ స్వచ్చమైన బట్టల మీద చిన్న మరకపడినా అది దూరము నుండి కూడా స్పష్టముగా, అసహ్యముగా కనిపిస్తుంది. సదాచారము నందు బాధ్యత లేకపోతే ఎంత జ్ఞానము ఉన్నా చేసే పని పాపము రూపములో నిక్షిప్తమై ఉంటుంది.              

బాహ్య స్వరూపము – అంతర్ ప్రవృత్తులు

కర్మ అనేది మన చేతల (actions) మీద కంటే మనస్సు మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. బయట కనిపిస్తున్నదానికంటే మనస్సులో ఏమి జరుగుతున్నది అనేదాని మీదే బాహ్య ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అంతఃకరణ ఈ కర్మ (పని) ఏ ఆలోచనతో, ఏ కోరికతో, ఏ పరిస్థితులలో ఎందుకు చేసాను అని ఆలోచించును. మనలోని గుప్తమనస్సు రహస్య గూఢచారివలె ప్రతిక్షణము వెంటఉండి మంచిచెడు పనులను యధాతధముగా రహస్య డైరీలో (చిత్రగుప్తడు) పొందుపరుచును. దీని ఆధారముగానే పాపపుణ్యములు కొలవబడతాయి.
 
ఉదాహరణకు ఒకే నేరము చేసిన వారికి కోర్టు వేరువేరు శిక్షలను విధిస్తుంది. ఎలాగంటే ముగ్గురు హత్య చేసిన వ్యక్తులను పట్టుకొనగా ఒకనిని కోర్టు విడిచిపెట్టగా, ఒకనికి ఐదు సంవత్సరముల శిక్ష, మూడవ వానికి యావజ్జీవశిక్ష విధించినది.
 
ఇందులో విడిచిపెట్టబడినవాడు ఇళ్ళుకట్టే కూలివాడు. ఇంటి పైకప్పుపై పనిచేస్తున్నప్పుడు అకస్మాత్తుగా రాయిజారి క్రింద వెళ్తున్నవానిపై పడగా అతని తలకు దెబ్బ తగిలి మరణించెను. ఇక్కడ మరణం సంభవించినది కానీ అది తెలిసి చెడు ఆలోచనలతో చేసినది కాదు. అందువలన ఇక్కడ కూలివాడు నిర్ధోషిలా విడిచిపెట్టబడ్డాడు. రెండవ అపరాధి రైతు. అతని పంట దొంగతనము చేస్తున్నవానిపై దాడిచేయగా అతను మరణించెను. కోపము రావడము మనిషి స్వభావము కానీ మరణించునట్లు కొట్టడము తప్పు. చేసిన అపరాధానికి పశ్చాతాపము పడుతూ, ప్రాయశ్చిత్తము చేసుకొనడానికి సిద్ధం అయ్యాడు. అందుచేత అతనికి ఐదు సంవత్సరముల జైలు శిక్ష విధించబడినది. మూడవ అపరాధి దొంగ. అతను ఒక ధనవంతుని హత్యచేసి ధనమును అపహరించెను. అతని అపరాధము నీచమైనది, తెలిసి చేసినది. కాబట్టి ఇతనికి కోర్టు యావజ్జీవశిక్ష విధించినది.
 
ఈ ముగ్గురు అపరాధులే, వారి నేరము యొక్క బాహ్యరూపము సమానము. కానీ శిక్ష బాహ్యస్వరూపమును బట్టి కాక లోపలి ప్రవృత్తులను అనుసరించి లభించింది. బాహ్యముగా (physical) చూస్తే కోర్టు శిక్ష విధించినది అని అనిపిస్తుంది. కానీ శిక్ష లభించినది మాత్రము వారి పాపపుణ్యములను అనుసరించి మాత్రమే. 
 
మానవ జీవితములోని విశేషమేమిటంటే ప్రతివ్యక్తి కొరకు వేరువేరు చట్ట వ్యవస్థ ఉంటుంది. లంచం విషయములో ఒక నౌకరు, ఒక క్లర్కు, ఒక మేజిస్ట్రేట్ ను పట్టుకుంటే వీరి ముగ్గురికి వేరువేరు శిక్షలు లభిస్తాయి. బహుశ నౌకరును మాటలతో దండించి పంపివేస్తే, మేజిస్ట్రేట్ ను డిస్మిస్ చేస్తారు. ఎందుకంటే అతను అందరికంటే ఎక్కువ బాధ్యత కలిగిన ఉద్యోగి.
 
చిన్న పెద్ద స్థితులలో (positions) ఉన్న ఉద్యోగుల యొక్క ఆచరణ (లంచం తీసుకోవడం) ఒకే విధముగా ఉన్నా మానసిక స్థితిని అనుసరించి చెడును లెక్కించుటలో ఎక్కువ తక్కువలు ఉంటాయి. జ్ఞానముతోపాటు మంచిని చెడును అర్ధం చేసుకునే వివేకము, యోగ్యత పెరుగుతాయి. తెలిసి చేసినా తెలియకచేసినా తప్పు తప్పే కానీ తెలిసి చేసిన తప్పుకి ఫలితము (దండన) ఎక్కువగా ఉంటుంది. అజ్ఞాని తప్పు చేసినా ఎటువంటి ప్రభావము ఉండదు. కానీ కర్తవ్యమును విడిచినవారు మాత్రము శిక్షార్హులు అవుతారు.